All about Sama Veda – Chapter 9 (సామవేదీయ సర్వస్వము – నవమార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

నవమార్చిక

సప్తస్వరాత్మికము

పూర్వార్చికయందు సామ ఋక్కులు ఒకటి తర్వాత ఒకటిగానుండును. కాని ఉత్తరార్చికయందు ఋక్కులు తృచముగా అనగా ప్రగాథ రూపమున ఉండును.

ప్రగాథమునందు ఋక్సామలు, ఋగ్వేదమునందువలెనే, త్రిస్వరాత్మికముగా ఉదాత్తానుదాత్తస్వరితముగా నుండును.

కాని సామలైన ఋక్కులు అట్లుకాదు. సప్తస్వరాత్మికములు.

సామవేద శాఖలైన జైమిని, కౌథుమ రెండు శాఖలందును, అర్చిక మరియు సంహితా భాగములు సప్తస్వరాత్మికముగనే ఉండును.

సనాతన సామవేద స్రవంతి

గ్రామేగేయగానము, గ్రామే అరణ్యగానము, ఊహగానము, ఊహ్యగానములు సప్తస్వరాత్మికములుగా, సామగులు సామవేదీయులు, తండ్రి నుంచి కొడుకు, గురువు నుంచి శిష్యుడు ఆదికాలము నుండి పఠించుచునే ఉండిరి.

సామగానము లేని యజ్ఞము యజ్ఞమే కాదని శ్రౌతసూత్రకారుల మాట.

హోతృవర్గము, అధ్వర్యువర్గము, ఉద్గాతృవర్గము, బ్రహ్మవర్గములైన 16 ఋత్విక్కులు కలసి సత్రమహాయగములను పరిపూర్తిచేతురు.

 

యస్తే॒ స్తనః॑ శశ॒యో యో యో మ॑యో భూర్యేన॒ విశ్వా॒ విశ్వాపుష్య॑సి వార్యాణి॑ ।

యో ర॑ల॒ధా వ॑సు॒ విద్యః సు॒దత్రః॒ సర॑స్వతి తమి॒హ ధాత॑వే కః ॥
यस्तेस्तनःशशयो यो यो यो भूर्येनविश्वाविश्वापुष्यसि वार्याणि॑ ।

यो धा सुविद्यः सुदत्रःसरस्वति तमि धातवे कः
 • ఋగ్వేద – 1-164-49
 • అథర్వ – 7-10-1
 • వాజసనేయ – 38-4
 • తై. ఆరణ్యకము – 4-8-2
 • శతపథ బ్రాహ్మణము – 14-9-4-28

చాలమంది అభిప్రాయములో ఋగ్వేద మన్త్రములను, ప్రార్థనార్థము, దీర్ఘముల తీయగా సామమైనదని. ఇది సవ్యమైన ఆలోచనకాదు.

ఋఙ్మ్ంత్రములు ఎట్లు ఆవిర్భవించినవో సామలు గూడ అటులనే అవతరించినవి. సామలెట్లు ఉదయించెనో, “గేయములు” గూడనట్లే ప్రాదుర్భవించెను.

అనగా, ఋక్కులు, సామలు, గేయములు అన్నియు అపౌరుషేయములే. అటులనే శుక్లయజుస్సులు, కృష్ణయజుస్సులు, అధ్వరములు – అన్నియును అపౌరుషేయములు.

ఈ‍ గ్రంథమందు, నేను చెప్పినదే తిరిగి చెప్పుట సంభవించవచ్చును. దానివలన నష్టము లేదు. వేదమునకు సంబంధించినది ఏది అయినను చర్విత చర్వణమగుట మంచిది. ఆ విషయము మనస్సునకు ఇంకొకసారి గుర్తు అగును.

సామసంహితా విభాగములు

అర్చికలు: సామసంహిత ప్రధానముగా అర్చికలుగా విభజింపబడినది. మొదటిది పూర్వార్చిక. రెండవది ఉత్తరార్చిక.

పూర్వార్చిక తిరిగి యీ విధముగా విభజింపబడినది:

 1.    ఛందార్చిక
 2.   మహానామ్నార్చిక
 3.   ఛందార్చిక పరిశిష్టము
 4.  క్రోడపత్రము

పూర్వార్చిక, అర్చికలుగానేగాక, కాణ్డలుగా విడివడి విరాజమానమగుచున్నది. అట్లు విభజింపబడిన కాణ్డలు నాలుగు. అవి:

 1. ఆగ్నేయమ్
 2. ఐన్ద్రమ్
 3. పావమానమ్
 4. ఆరణ్యకమ్

ఆగ్నేయైన్ద్రపావమానారణ్యకముల నందున్నవి ఋక్కులు. ఈ ఋక్కులకు ఛందస్సు, దేవత, ఋషులు ఉన్నవి.

వీని ఛందస్సులు సామఛందస్సులు. ఋగ్వేదమన్త్ర ఛందస్సులు కాదు.  దేవతలు సామదేవతలు. ఋషులు సామఋషులు. అనగా ఈ ఛందస్సులు, దేవతలు, ఋషులు సామలుగా మారిన ఋక్కులకు సంబంధించినవి.

ఋగ్వేదమునందు మొత్తము 3,97,265 ఋక్కులున్నవి.

సామవేదమునందు మొత్తము 1599 సామలున్నవి.

సామలు నాలుగు రకములుగా విరాజిల్లుచున్నవని యిదివరకే వ్రాసితిని గదా! వానిలోని నాల్గవ రకము సామ సామలు అని పేరని గూడ పూర్వమే చెప్పబడినది.

ఈ సామలు సామవేదమునందు వరుసగా లేవు. అచ్చటచ్చట విరాజమానమగుచున్నవి.

ఛందార్చికలోనున్న సామలకు గానములున్నవి. ఆ సామములను, ఏ భాగములోనున్న, ఆ భాగ సామలుగ వ్యవహరింతురు.

 1.    గ్రామేగేయగానమునందలి సామలు గ్రామేగేయగాన సామలు
 2.   గ్రామేఅరణ్యగానమునందలి సామలు గ్రామేఅరణ్యగాన సామలు
 3.   స్తోభగానమునందలి సామలు స్తోభగాన సామలు
 4.  భారణ్డమునందున్న సామలు భారణ్డ సామలు
 5.   తవాశ్వీయమునందున్న సామలు తవాశ్వీయ సామలు

సామసంహిత ప్రధానముగా పూర్వార్చిక, ఉత్తరార్చిక అని రెండు భాగములు గదా!

పూర్వార్చిక చివరకు ముందున్న భాగమునకు పరిశిష్టము అని పేరు. అందున్న సామలు పూర్వార్చికాపరిశిష్ట సామలు. చివరిభాగమునకు క్రోడపత్రము. అందలి సామలు క్రోడపత్రసామలు.

నవమార్చిక సంపూర్ణము

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: