All about Sama Veda – Chapter 7 (సామవేదీయ సర్వస్వము – సప్తమార్చిక)

సప్తమార్చిక

 

ప్రధానమైన ప్రశ్న

వేదములను గూర్చి, విచారించువేళ, ఒక ప్రధానమైన ప్రశ్న ఉద్భవించును. అసలీ వేదములు ఎందుకు ఉద్భవించినవని. మనకు తెలియని విషయము తెలియపరచుటకు.

 

తెలిసికొనుట ఎట్లు?

మనకు విషయము తెలియనిచో, తెలిసికొనుట ప్రయత్నము చేసి తెలుసుకొనెదము. Dictionaries, Encyclopedias – నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వములను చూచెదము. అందులో కూడ లేనిచో, పెద్దలకు గూడ తెలియనిచో, సృష్ట్యారంభమునుండి పుట్టిన ఏ మానవునికి తెలియనిచో, అపుడు ఏమి చేయవలయునో తెలియదు.

సృష్టిని చూడము

మనమీ సృష్టిని జూచుచున్నాముగదా! పిల్లకు తెలియని దానిని, తల్లి తెలుపును. నోరులేని పశుపక్ష్యాదులు కూడ వాటి వాటి పిల్లలకు ఆపదనుండి తప్పుకొనుట, ఆహారమును వెతకికొనుటలు నేర్పును. కాకి తన పిల్లకు, వడిసెల దెబ్బను తప్పించుకొను విధానము నేర్పును. కాకి పిల్ల, తల్లిని జూచి, కర్ర పుల్లలతో గూడు కట్టుకొనుట నేర్చుకొనును.

అనగా యీ సృష్టియందు జీవి ఉద్భవించినది అనగా, దానికి అవసరము అయిన జ్ఞానమును యిచ్చునది ఉండి తీరును.

 

మానవనైజము

మానవునకు, ఎన్ని తెలిసినను, ఆ పైన ఏమున్నది? అనిన ప్రశ్న పుట్టుచునే ఉండును. ఆ ప్రశ్న పుట్టుట మానవ నైజము.

 

తెగని ప్రశ్నలు

మానవునకు తెగని ప్రశ్నలున్నవి.

 • తానెచ్చటనుండి వచ్చెను?
 • తానెచ్చటకేగును?
 • శరీరాంతమున తాను ఏమగును?
 • అసలీ శరీరాకారమును యిట్లు చేసినదెవరు?
 • తనకీ ప్రశ్నలను పుట్టించు ఊహను, ఆ ఊహను కల్పించు జ్ఞానమును, ఎవరు కలుగజేసిరి?
 • నిరాకారములైన అక్షరములు వాగ్యంత్రమున, శాబ్దికమైన సాకారములెట్లు అగుచున్నవి?
 • వీటి అన్నిటి కర్త ఎవరు? ఆ ‘వ్యక్తి’ లేక ‘శక్తి’ పేరేమి?
 • ప్రతివాడును నా కన్ను, నా ముక్కు అనుచున్నాడు గాని, “నేనే ముక్కును” అనుట లేదు. ఈ శరీరమునకు, ఈ సృష్టికిని వేరయిన “నేను” అనిన పదార్థమెట్టిది?
 • అది మాయమగునా? అవదా? అది నిత్యమా? అనిత్యమా?

 

సమాధానము చెప్పగలిగినదెవరు?

ఈ ప్రశ్నలకెవ్వరును సమాధానము చెప్పలేరు. మహా మేధావులు కానిమ్ము, ప్రవచనవేత్తలు కానిమ్ము, మతాధికారులు కానిమ్ము. ఎవ్వరికిని సాధ్యము కాదు. ఆ చెప్పగలిగినది సృష్టికి పూర్వమే ఉండి ఉండవలయును. అదిగాక, యీ సకలసృష్టిని, అందులోనున్న యీ పశుపక్ష్యాదులను, యి మానవుడు యీ విధముగా సృష్టింపగల జ్ఞానవంతమై ఉండవలెను. ఆ జ్ఞానమును చెప్పగలిగి ఉండవలెను.

 

చెప్పుట ఎట్లు?

ఏది యెవరు, ఎప్పుడు చెప్పిననూ మాటల ద్వారానే. అక్షరములతో కూర్చినది, పేర్చినది మాట.

కనుక మాటకు అక్షరము ముఖ్యము. ఆ అక్షరము మనము, యీ సృష్టి సముద్భవము కాక ముందున్నది అయి ఉండవలెను.

మనముగాని, ప్రపంచములో మరి ఎవ్వరుగాని, తమలోని ఊహలను, అభిప్రాయములను, ఈప్సితములను, అభీష్టములను, ఆశలను, నిరాశలను, సుఖములను, దుఃఖములను తెలుపుటకు వలసినది అక్షరము. అక్షరము చేతనే మనము మన సర్వమును, వ్యక్తము చేయగలుగుచున్నాము.

ఆ అక్షరము చేతనే మనలను సంపూర్ణముగ, సువిస్పష్టముగ, సాకల్యముగ, తెలియగలుగుటకు, సృష్టికి పూర్వముండి సృష్టిని వివరింపగల వేదమే చెప్పగలదు. చెప్పుచున్నది.

ఆ అక్షరసముదాయమునకు నమస్కరించి, అన్ని వేదములయాందును ఆ “అక్షరము”‍ ఎట్లు విరాజమానమగుచున్నదో విచారించెదము.

 

అక్షరలక్షణములు

మనమా అక్షరమును,  ఏ భాషలో ఎట్లు వ్రాసినను, పలుకు విధానమొక్కటే. ఏ దేశపు మనిషి అయినను, ఏ ప్రాంతము వాడైనను, అవతలవానికి తన మాట తెలియవలెననగా,

 • సువిస్పష్టముగా పలుకవలెను.
 • అక్షరములను వేగముగా ఒకదానిమీద మరియొకటి పడునట్లు వేగముగా పలుకరాదు.
 • అక్షరమును సాగదీసి తరువాత అక్షరము తెలియనంతకాలమును వ్యర్థపరచరాదు.
 • ఆ అక్షరమును చెవులు పగులునట్లు అరవరాదు.
 • అటులనే అవతలవానికి వినపడనంత నెమ్మదిగ పలుకరాదు.

అనగా అక్షరోచ్చరణకు ఈ క్రింది మూడును ప్రధానము.

 

అక్షరోచ్చరణ విధానము

 1. సువిస్పష్టత
  అనగా వాగ్యంత్రమున ఉన్న పరికరములు, పనిముట్లు ఆరోగ్యముగా, సవ్యముగా నుండవలెను. పన్నులు, పెదిమలు, గొంతు, నాలుక, అన్నియు ఆరోగ్యము అయిన స్థితిలోనుండవలెను. దానికి వలసిన exercises – వ్యాయాములు, యోగాభ్యాసము వంటివి ప్రతిదినమాచరింపవలెను.
 2. హెచ్చుతగ్గులు లేక సమముగా పలుకుట
  దీనికి గురువు సహాయము అవసరము. గురువు చిన్న తరగతులయందు, ప్రతి అక్షరమును దిద్దువేళ, స్పష్టముగా, హెచ్చుతగ్గులు లేకుండ పలుకుటను అలవాటు జేయును. పెద్ద అయిన తరువాత గూడ, తెల్లవారుఝామున లేచి, సువిస్పష్టముగ పలుకుటను అభ్యాసము చేయవచ్చును.
  తెల్లవారకట్టగాని, మరి యే యితర సమయమునగాని, తీరిక ఉన్న సమయములలో శతకములను నెమ్మదిగ చదువుకొనవచ్చును. దాని వలన అక్షరోచ్చరణయందు విస్పష్టత, అనేక నూతనశబ్దముల పరిచయము కలుగును.
 3. అక్షరోచ్చరణలో, అక్షరములను సాగదీయరాదు.
  అక్షరమును పలుకుట పొడిగించినచో, వినువారికి, తరువాత అక్షరము తెలియక, చెప్పెడు మాటను అవగాహనము చేసుకొనలేక, విసుగు పుట్టును.

అందువలన, సువిస్పష్టాక్షరము తరువాత అక్షరముగా పలికినచో, వినువారికి అహ్లాదముగానుండును. అక్షరము సాగదీయుట, సాగదీయకపోవుట “కాలము”నకు సంబంధించినది. వేదపఠనమునందు కాలమును “మాత్ర”లతో కొలిచెదరు.

సామవేదమునందు ప్రత్యక్షరము – యిన్ని మాత్రల కాలము ఉచ్చరింపవలెను అనిన నియమమున్నది. అచ్చు అయిన సామవేద గ్రంథములయందు ఆ నియమమును ప్రతి అక్షరము నెత్తిమీదను, అక్షరము ప్రక్కలను వ్రాసెదరు. ఆ నియమములను గుర్తించు పద్ధతిని తరువాత వివరించెదను.

 

కకావికలు

వేదములందు, చెప్పెడు విషయమంతయును ఒకచోట సంపూర్ణముగ జెప్పి, తరువాత విషయమునకు పోవు పద్ధతి కనపడదు. ప్రత్యేకముగ సామవేదమున, ఆ స్థితిని గమనింపవచ్చును.

ఋక్కునుండి వచ్చిన సామలన్నియును ఒక్కచోటనుండవు. ఋక్కునుండి వచ్చిన సామను ఋక్సామయందురు. సామవేదమునందు మాత్రమే ఉన్న సామలను “సామ సామలు” అందురు. అటులనే కృష్ణయజుర్వేద సామలు, శుక్లయజుర్వేద సామలు, అథర్వవేద సామలు – ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటిగా నుండును.

అనగా చెల్లా చెదరుగానుండును. ఈ చెల్లాచెదురును “యథా యథలు” అందురు. యథాయథాలకు ఇంకొకమాట – కకవికలు లేక కకావికలు.

కకావిక స్థితి అన్నివేదములయందును ఉన్నది. సామవేదమునందు యీ స్థితిని బాగుగా చూడవచ్చును. వేదమునందీ “కకావిక స్థితి” ఎందుకున్నది? వేదము మనలనుగూర్చి మనకు తెలియజేయు గ్రన్థము కదా!

మనము “కకావికులము” కావున మనకు మన కకావిక స్థితినిగూర్చి తెలియజేయవలెనని వేదము ఆ విధముగా విరాజమానమగుచున్నది. మనలను జూడుడు. ఈ క్షణములో రామాయణ కథలోని రామపట్టాభిషేకమును గూర్చి ఊహింతము. మరుక్షణము దొడ్డిలో బట్టలారినవో లేదో అనిన ఊహ వచ్చును. ఆ మరుసటి క్షణము, బజారు పోయి కూరగాయలు తేవలెనని. మరియొక క్షణమునందు T.V. News చూచి బజారు పోవుదమని.

ఈ విధముగా ఊహా చంక్రమణము సేయు బుద్ధి “కకావికము” గాక మరి ఏమి? నిశ్చయముగా మనము “కకావికులము”. 

వేదము మన మొగమెదుటనున్న అక్షరదర్పణము. మాటల అద్దము. దానిలో చూచుకొనుము. మన కకావికలత సువిస్పష్టముగా కనపడును. అది మనము తీసివేయలేము. కారణము దానిని కల్పించలేదు. మన కన్ను, ముక్కు, చెవులు ఎవరు చేసిరో, ఆ శక్తియే మన ‘కకవిక’ స్థితికి కారణము.

 

శిక్ష – షడంగములు

“శీక్ష” లేక “శీక్షా” అనగా నియమము. నియమించుట, ఇట్లుండవలెననుట, బోధించుట, నేర్చుకొనుట, శోధించుట, వినయము, శిక్షణము, శిక్ష, శీక్షా అన్నియు ఒకదానికొకటి సంబంధించినవి. అందువలన “శిక్షకుడు” అనగా బోధించువాడు, అధ్యాపకుడు.

శిక్ష షడంగములలోనొకటి. వేదమును విశదముసేయు శాస్త్రమునకు “అంగ”మని పేరు. వేదమును తెలుసుకొనటకు ఉపయోగమైన శాస్త్రములు ఆరు. అవి – శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము.

మన వాగ్యంత్రమున,

 1. అకారము – మొదలైన అక్షరములయొక్క స్థానము – పుట్టుచోటును,
 2. ఆ అక్షరము బయటకు వచ్చు విధానము
 3. ప్రయత్నము – మన యత్న స్వరూపము

– వీటిని బోధించునది శిక్షా శాస్త్రము.

“ప్రాతిశాఖ్యము” గూడ యించుమించు “శిక్ష” వంటిదే. అందుగూడ అక్షరస్వరూపము, దాని ఉచ్చారణ విధానములను గూర్చి చెప్పును. కాని “శిక్ష”‍ సామాన్య శాస్త్రము. “ప్రాతిశాఖ్యము” ప్రత్యేక శాస్త్రము. ఆ శాస్త్రమున ప్రస్తావింపబడుచున్నవేదశాఖకు సంబంధించిన విషయములన్నియును కూలంకషముగా వివరింపబడియుండును.

 

శౌనకముని వ్రాసిన ఋగ్వేద ప్రాతిశాఖ్యము

శౌనక మహాముని ఋగ్వేదమునకు ప్రాతిశాఖ్యము వ్రాసెను. ఈ మహా గ్రంథమును ఆయన – 15 పదునేను రోజుల సత్రయాగము సేయుచు, భోజనానంతరము తీరికవేళలో వ్రాసెను. బహుశః నోటితో చెప్పుచుండగా శిష్యులెవరో వ్రాసియుందురు. ఆయన ఆ మహాగ్రంథమును పటలములుగా విభజించెను.

 • (1) – సంజ్ఞా – పరిభాషా పటలము:‍ అక్షరములు మరియు సంజ్ఞలను (technical term definition) గూర్చి
 • (2) – సంహితా పటలము:‍ సంహితను గూర్చి
 • (3) – స్వర పటలము:‍ అక్షర స్వరమును గూర్చి
 • (4) – సంధి పటలము – అక్షరముల కూడిక, అక్షర సంయోగ స్వరూపమును గూర్చి
 • (5) – నతి పటలము – నకార, ణకారములు యితర అక్షరములతో కూడు విధానము
 • (6) – ధ్వన్యాగమ పటలము – స్వరము – విభక్తి; అక్షరస్పర్శ – ఖ, క్షల వంటి అక్షరసంయోగముల గూర్చి
 • (7, 8, 9) – ప్లుతి పటలములు
  1. హ్రస్వాక్షరమును ఉచ్చరించుకాలము. హ్రస్వము – ఉదాహరణము‍:‍అ, క, న, ప, వంటి అక్షరములను ఉచ్చరించు కాలము – 1 మాత్ర
  2. దీర్ఘాక్షరమును ఉచ్చరించు కాలము 2 మాత్రలు – ఆ, కా, హా – వంటివి
  3. దీర్ఘముకన్న ఎక్కువ కాలము ప్లుతి. అది 3 మాత్రలు కావచ్చును, దీనికన్నా ఎక్కువ కాలము కూడ కావచ్చును.
   సామవేదమునందు ప్లుతిలో నుచ్చరించవలసిన అక్షరములు చాల ఎక్కువ.
 • (10, 11) – క్రమ పటలములు:‍ ఇందు, సంధి చేయు అక్షరము వెనుకనున్న అక్షరము, వెనకనున్న అక్షరము ఎటుల పలుకవలెనో చెప్పు పతలమిది.
 • (12) – సీమా పటలము – నామములు, అఖ్యాతము, ఉపసర్గలు (ః), నిపాతములు ‍- అనగా నామాఖ్యాతోపసర్గలు కాని అక్షరముల నిరూపణము. అక్షరములను నాలుగు రకములగా గూడ విభజింతురు
  1. నామములు – పేరులు – రామ, కృష్ణ
  2. ఆఖ్యాతములు – కథలు, కథల పేరులు – మేనకా విశ్వామిత్రము, ప్రమీలార్జునీయము
  3. ఉపసర్గలు – రామః, కృష్ణః వంటివి
  4. నిపాతములు – పైవేవియు కానివి
 • (13) – శిక్షా పటలము – వాచ్య వృత్తిని నిరూపించుట, వర్ణోత్పత్తి యొక్క బాహ్య ప్రయత్న, వర్ణోద్భవ, వర్ణ స్వరూపములను వివరించును.
 • (14) – ఉచ్చారణ దోష పటలము – అనునాసికములు – ముక్కుతో పలుకునవి. कँ, घ्नँ, पँ – వంటివి, మొదలైన అక్షరములు, సామాన్యమైన అక్షరములను పలుకుటలో గల దోషముల వివరములు. “జ్ఞానము”‍బదులు “గ్నానము”‍ అనుట వంటి దోషములను గూర్చిన పటలము.
 • (15) – ఓంకార పటలము – గురుశిష్యులు ఓంకారమును పలుకుట యందున్న, అటులనే, తండ్రి కొడుకుల మధ్యను ఓంకారమును పలుకుటలోనున్న దోషములనుగూర్చి విచారించును. ఇది ప్రత్యేకముగా వేదాధ్యయన – అధ్యాపన వేళలందు
 • (16, 17, 18) – ఛందః పటలము – ఇందు వేద ఛందస్సులను గురించి సంపూర్ణముగా వివరింపబడి ఉన్నది 

 

సప్తమార్చిక సంపూర్ణము

 

Advertisements
Leave a comment

1 Comment

 1. Raghava – Keep it coming. Vamsi

  Like

  Reply

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: