All about Sama Veda – Chapter 6 (సామవేదీయ సర్వస్వము – షష్ఠమార్చిక)

షష్ఠమార్చిక

 

 1. ఐదు వేదముల విభాగములు

ప్రతివేదమును అవతరించినానంతరము, మన ప్రకరణార్థము (reference purposes) మన పూర్వులు విభాగములు చేసిరి. వేదము “ఆ సేతు శీతాచలము”‍ పఠించుటజేసి, ఏ ప్రాంతమువారు ఆ ప్రాంతమునకనువుగా విభజనము చేసుకొనిరి. ఆంధ్ర, ద్రవిడ (తమిళ) దేశములందు చేసిన విభజనను ఇతరప్రాంతములయందు తెలియదు. అటులనే ఇతర ప్రాంతములయందు చేసిన విభజనలు తెలుగుదేశమున తెలియదు.

ఇదిగాక ప్రతి వేదమునందును ఆ వేద విభజనము చెప్పబడినది. ఈ విభాగములు ఆసేతుహిమాచలము తెలిసినవి. ఇది అతి పురాతనమైన విభజనము.

 1. ఋగ్వేదము – పది మండములుగా విభజింపబడినది.
 2. కృష్ణయజుర్వేదము – ఏడు కాణ్డలుగా విభజింపబడినది.
 3. శుక్లయజుర్వేదము – 40 అధ్యాయములుగా విభజింపబడినది.
 4. అథర్వవేదము – 20 కాణ్డలుగా విభజింపబడినది.
 5. సామవేదము – 2 అర్చికలుగా విభజింపబడినది.

ఇవి ప్రధానమైన విభాగములు. ఈ విభాగములలో అనేకములైన చిన్న పరిచ్ఛేదములున్నవి. ఐదువేదముల పరిచయములు వేరువేరు గ్రన్థములుగా వ్రాయుచున్నాను గాన, ఏ వేదగ్రన్థమందా వేదగత సకల విభాగములను వ్రాతును.

ఇది సామవేద పరిచయము కాన యీ క్రింద సామవేద సకల విభాగములను సంపూర్ణముగ వివరింపబడినవి.

వేదములే, విశాలములు. అందు సామవేదము మరియు విశాలము. ఏదైనా ఒక్ విభాగము పేరు నేను మరచినచో, వేదవిజ్ఞులు తెలియజేసినచో కృతజ్ఞతతో నేను నా లోపమును దిద్దుకొనెదను.

 

 1. క్రియాశక్తి

“క్రియా” శబ్దము నామవాచకమైనచో “పని”‍ అని అర్థము. అదియే క్రియావాచకమైనచో “చేయు” అనిన అర్థమునందు verb గా వాడినచో – అపుడు “క్రియాశక్తి”‍ పనిసేయుటకు కావలసిన శక్తి. పనిచేయగల శక్తి.

ఈ క్రియాశక్తి సకలప్రాణులకున్నది. పక్షులు ఆహారమును వెదకి తెచ్చును. పశువులు గడ్డి మేయును.

 

 1. మించిన శక్తులు

అన్ని ప్రాణులనుమించి, మానవునకు మూడు అధికమైన శక్తులున్నవి. 1. ఊహించుట 2. కావలసిన ఆహారమును పండించుట 3. ఆ పండించుటకు వలసిన సామగ్రిని తయారు చేయుట, కూడ బెట్టుట. ఆహారముకొరకు, విహారము కొరకు, దేశాంతరములు, ఖండాంతరములు, గోళాంతరములను (భూగోళము దాటి, ఇతర గోళములకు) ప్రయాణము సేయుట.

 

 1. ముందు పుట్టినవి

ఈ బ్రహ్మాండమునందు మనకన్న ముందు పుట్టినవి ఉన్నవి. అవి 1. ఆకాశము. 2. వాయువు. 3. తేజస్సు. 4. నీరు. 5. పృథివి.

ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశములయొక్క భిన్నభిన్న పరిమాణముల (proportions) కలయికతోడనే, మనమును, సర్వచరాచరములును ఉద్భవించినవి.

 

 1. క్రియాశక్తి స్వరూపము

ఈ సకల చరాచరముల సృష్టి, వాటి ఆకార, విగ్రహ విశేషములను ఊహించు శక్తి, ఆ ఊహకు సాకారము కల్పించు శక్తియే “క్రియాశక్తి”, అని మనము పిలుచుచున్నాము.

 

 1. జ్ఞానసృష్టి

వీటిలో ఒకప్రాణమును తప్ప, తక్కినవన్నిటిని మనము చేయగలుగుచున్నాము. యంత్రములు, కర్మాగారములు, భూమిలోనిండి ఖనిజములను త్రవ్వుట – ఒకటేమిటి, పైన చెప్పినట్లు ఒక్క ప్రాణమును సేయలేకున్నాము. ఆ ప్రాణమునకు ఊహ, జ్ఞానము కల్పింపలేకున్నాము.

అది మనకు మించిన శక్తియగుట వలననే మనము, ఆ శక్తి ఉన్నచోటునకు వెతుకుచు, అనేక జన్మలంబడి ప్రయత్నించుచున్నాము. ఆ శక్తి కొరకు వెదకుటే, మన జీవనధ్యేయమైనది.

 

 1. బ్రహ్మముతో సమైక్యము

మన భోజనము, బ్రతుకు, సుఖములు అన్నియును ఆ సకలక్రియాశక్తి అయిన “బ్రహ్మము” చేరుటకొరకని మనమనుకొనకపోయినను, మన అంతరాంతరములందున్న కోరిక. ఆ “ఇష”యే మనలను జన్మ, జన్మగా ముందుకు తోయుచున్నది. “ఇష” – కోరిక అనిన శబ్దము – వేదశబ్దము.

మనకోరికలయొక్క క్రియాస్వరూపమును వివరణము సేయు కృష్ణయజుర్వేదము ఈ శబ్దముతోడనే ఆరంభమగుచున్నది.

“इ॒षेत्वो॒र्जेत्वा॑ वा॒यव॑स्थो……..” అని ఆరంభము. కృష్ణయజుర్వేదము, ప్రథమానువాకము.

చివరకా “బ్రహ్మము”ను చేరగనే మనమందులో లీనమయి, మన వ్యక్తిత్వము, మన అస్తిత్వము అంతమయిపోవుచున్నది. అపుడు మిగిలెడిది ఒక్క బ్రహ్మమే.

ఏకమేవాఽద్వితీయమ్ బ్రహ్మ.

 

 1. మాటాడు శక్తి

బ్రహ్మము మనచేత మరియొకటి చేయించుచున్నది. అది కూడ ఒక్క మానవులకే సాధ్యము. అదియే పలుకు శక్తి. మాటాడు శక్తి. ఈ శక్తివలన మనము మనలోనున్న ఊహలను అభివ్యక్తము సేయగలుగుచున్నాము. అనగా మనలోని నిరాకారమైన ఊహకు శాబ్దికమైన సాకారము కలిగించుచున్నాము.

ఈ శాబ్దికమైన ఉచ్చారణశక్తి పృథివ్యాపస్తేజోవాయురాకాశములతో చేయబడలేదు. తదతీతమై, తద్భిన్నమై, విరాజిల్లుచున్నది. మన ఊహకు శాబ్దికమైన సాకారము కలిగించుటకొరకే మన వాగ్యంత్రము సృష్టింపబడినది.

ఈ వాగ్యంత్రము అరచును. పిట్టలు, పులులు, పక్షులు అన్నిటికిని ఈ వాగ్యంత్రమున్నది. అన్నియును తమ అవసరములను అభివ్యక్తముసేయగలవు. చెప్పగలవు.

కాని మానవుడొక్కడికే, ఆ కోరికను విడమరచి, “యిది – యిది” – ఇది ముఖ్యము – దీనిని వెంటనే సేయవలయును; ఈ పని తరువాత సేయవచ్చును; ఇది ప్రాణావసరము – మొదలైన వివరములను ఇచ్చి అక్షరసంకలితమైన శబ్దములతో మాటాడు శక్తి ఉన్నది.

 

 1. అక్షరోచ్చరణ శక్తి

ఈ అక్షరములతో మనము అనేకమైన భాషలను నిర్మించుచున్నాము. ఒక భాష చనిపోయి, మరియొక బాస పుట్టుచున్నది. ఒకభాషతో మరియుక భాష సంకరమై కొత్త భాషలు పుట్టుచున్నవి. హిందీ, పర్షియన్ భాషల కలయికలొ ఉర్దూభాష పుట్టినది.

 

 1. భాషలలో మార్పులు

కాలము ప్రవహించినకొలది, ఈ భాషలయందు మార్పులు కానవచ్చుచున్నవి. సంస్కృతమునుండి ప్రాకృతము, ప్రాకృతమునుండి మాగధి, అవధి, వారణాసీయము వంటి భాషలు పుట్టుచున్నవి. తెలుగు భాష, నన్నయ్యగారి కాలమున ఉన్నట్లు ఇప్పుడు లేదు. కావున భాష కాలమునుబట్టి మారుచున్నది.

అటులనే ప్రాంత, ప్రాంతమునగూడ మార్పులు కానవచ్చుచున్నవి. తెలంగాణమందున్న శబ్దములు కృష్ణ, గోదావరి జిల్లాలలో వాడరు. వాడినను, వేరు విధములుగా వాడెదరు. తెలంగాణమందు “పోయిరాలేదు” అందురు. కృష్ణ జిల్లాలో “పోలేదు”‍ అందురు.

అటులనే కొన్ని శబ్దముల వాడుటయే అంతరించుచున్నది.

కృష్ణదేవరాయల కాలములో శుభ్రముచేసి వండుటకు తయారుగా బియ్యమును “ఎసటిపోతలు” అనెడివారు. ఇప్పుడు ఆ మాట వ్యవహారములో లేదు. “ఎండగులు”‍ – ఎండబోసిన ధాన్యము – ఆమూక్తమాల్యదలో రాయలవారు వాడిన మాట. యీ కాలమునందు మనమా మాటను వాడుట లేదు.

 

 1. శబ్దములను భావికాలమునకందించుట

కృష్ణరాయలు ఆమూక్తమాల్యదలో వ్రాయుట వలననే, “ఎసటి పోతలు”, “ఎండగులు” అనిన మాటలుండెడివి అని తెలిసినది. లేనిచో, ఆ మాటలు అంతమయ్యెడివి. అటుల గ్రంథకర్తలు వారి గ్రన్థములయందు వ్రాయలేకపోవుట వలన ఎన్ని శబ్దములు మటుమాయమయినవో!

అల్లసానిపెద్దన్నగారు మనుచరిత్రలో “కూకటుల్ కొలిచి, చేసిన కూరిమి సోమిదమ్మ” అని వ్రాసినాడు. “కూకటుల్ కొలిచి చేయుట” అనగా ఏమిటి? దీని యర్థము యీ కాలమందెవరికిని, తెలియదు.

పెద్దన్నగారు తన కాలములో వ్యవహారమందు ఉన్నది, భావికాలమునగూడ ఉండునని ఊహించి ఉండవచ్చును. కాని అటులకాలేదు కదా!

అసలీ బాల్యవివాహము 16-17-18-19 శతాబ్దములలో వచ్చినవి.

బహుశః మహమ్మదీయుల దాడుల వలన, వారు వయసులోనున్న కన్యలను ఎత్తుకొనిపోవుటవలన, యీ ఆచారము వచ్చి ఉండవచ్చును. అతఃపూర్వమీ ఆచారము భారతీయ సంఘమునందు, హిందూ సంప్రదాయమునందు లేదు. దుష్యంతుడు శకుంతలను ఆమె యుక్తవయస్సునందు వివాయమాడెను. శుక్రాచార్యులవారి కూతురు దేవయానిని యయాతి, నూతిలోనుండి బయటకు తీయువేళకు ఆమె బహుశః 20-25 ఏండ్ల వయస్సు ఉండివచ్చును.

బాల్యవివాహాచారము అంతరించి, తిరిగి ఏ రోజులలో కన్యలు 20-25 సంవత్సరములు వచ్చినగాని వివాహమాడుటలేదు. యూనివర్సిటీలలో చదివి డిగ్రీలు సంపాదించి, ఉద్యోగములు సేయుచు, వివాహములాడుచున్నారు. ఇది ముదాహవమైన విషయము.

 

 1. అక్షరములెన్ని?

అసలు యీ అక్షరములు ఎన్ని? అక్షరముల సంఖ్య, భాష భాషలయందు భిన్నముగా ఉన్నది. సంస్కృతములో 44 అనుకుంటాను. తెలుగుయందెక్కువ. ఇంగ్లీషుభాషకు 26. అటులనే ఏ భాషకా భాషాక్షరసంఖ్య వేరుగానుండును.

 

 1. కొత్త శబ్దములు

అవిగాక, ఇతరదేశములనుండి క్రొత్తమాటలు వచ్చి, మరియొక భాషలో పడును. “స్పుత్నిక్” రష్యన్ భాషనుండి అన్ని భాషలలోనికి వచ్చి కూర్చున్నది. “ఆస్ట్రొనాట్” “astronaut” అంతరిక్షయాత్రికుడు, అమెరికన్ ఇంగ్లీషునుండి వచ్చినది. “Ayer rock”. అయర్ రాయిలో అయర్ పదము ఆస్ట్రేలియానుండి వచ్చినది.

 

 1. అక్షరాకారము

ఈ అక్షరాకారము ఇట్లుండవలెనని మనము నిర్ణయింపలేదు. పైనుంచి ఎవరో నిర్ణయించిరి. ఆ నిర్ణయించినవారు, అన్ని దేశములయందు, అన్ని భాషలయం‍దు, అన్ని ప్రాంతములందు, అన్నిజాతులవారు మాటాడు అక్షరములన్నిటిని, వేరు వేరుగా నిర్ణయింపనవసరము లేదు.

ఈ అక్షరసమామ్నాయమునకు మూలమైన అక్షర స్వరూపములను మాత్రము వివరించినచో చాలును. వేదమచ్చముగా అదియే పని చేసినది.

 

 1. వేదాక్షరములు

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఏ ఐ ఓ ఔ – 13

క ఖ గ ఘ ఙ – 5

చ ఛ జ ఝ ఞ – 5

ట ఠ డ ఢ ణ – 5

త థ ద ధ న – 5

ప ఫ బ భ మ – 5

య ర ల వ – 4

శ ష స హ- 4

ళ – 1

 

ఇవి గాక మరి ఐదు (5):

విసర్గ – ః

బిందుపూర్వకము – ంక

బిందుపరము – కం

‍బిందువు – ం

అనునాసికాయుతమైన అక్షరము – तँ, कँ

 

మొత్తము 47 + 5 = 52

ఈ 52ను వేదాక్షరములు. ఇందు ౡ, ఎ, ఒ లు లేవు. కారణము యీ అక్షరములు వేదమున కానరావు.

 

 1. పలుకు శక్తి

ఈ 52 అక్షరములను పలుకగలిగినచో ప్రపంచములో ఏ భాషలోని ఏ అక్షరమునైనను పలుకగలశక్తి కలుగును.

ఈ 52 అక్షరములు పలుకగలిగినచో, సకల భాషాక్షరములను పలుకగలరను మాటను ఎవరు ఊహించిరి? మనము ఊహింపలేదు. మన వాగ్యంత్ర నిర్మాణము చేసిన “బ్రహ్మము” నిర్ణయించినది. చిత్రముగా ప్రధానాక్షర సముదాయమున, దానిని ఉచ్చరింపగల వాగ్యంత్రమును సకలకార్యకారణకర్త అయిన “బ్రహ్మము”‍చేసినది.

 

 1. పలుకు శక్తినిచ్చిన బ్రహ్మము

అనగా కారణము, కార్యము ఒకే బ్రహ్మము చేసినచో, చేయవలెననిన ఊహగూడ అచటనుండియే రావలయును. కారణము ఆ ఉద్భవసమయమున ప్రాణులింకను ఆవిర్భవింపలేదు. సృష్టి ప్రథమవేళ అచ్చమైన బ్రహ్మము.

 

 1. అచ్చమైన బ్రహ్మము

కనుక ఊహ, ఆ ఊహ వచ్చు స్వరూపము, దాని నైజము, ఊహించుటయే నైజమైన బ్రహ్మము ఆ ఊహ కారణమై కార్యమైన ప్రధానాక్షర సముదాయము, వాటిని పలుకగల వాగ్యంత్రమున సృష్టించినది.

అందువలన ఊహా కారణ కార్య సమేళనమే “బ్రహ్మము” యొక్క రెండవ స్థితి. మొదటి స్థితి నైశ్చల్యము. ఏకముగా, తదితరమేమియు లేకుండనుండుట. “ఏకమేవాఽద్వితీయమ్ బ్రహ్మ” అనెడు స్థితి. రెండవ స్థితి పైన చెప్పినట్లు ఊహాకారణ కార్య సమేళనమైన క్రియాశక్తి.

ఆ శక్తియే ఈ బ్రహ్మాండ కల్పనా కారణము. ఈ అనంతమైన బ్రహ్మాండమును సృజింపగలుగుటచే, ఆ బ్రహ్మము అనంతము. ఈ అనంతమైన అద్వితీయమైన బ్రహ్మాండము సృజింపగలుగుటచే, ఆ బ్రహ్మము అద్వితీయము. ఈ అనంతమైన బ్రహ్మమును జ్ఞానముతోడ సృష్టింపగలుగుటచే, ఆ బ్రహ్మము జ్ఞానము. అనగా చిత్తు.

ఆనందముతో యీ సృష్టిని సృజించుచుండుట చేత బ్రహ్మము ఆనందము.

ఈ బ్రహ్మము, బ్రహ్మాండముండినను, లేకున్నను, సనాతనమై, నిత్యమై సత్‍(ఉండుట) విరాజమానమగుటచేత, బ్రహ్మము ‘సత్తు’.

 

 1. మనదారి

ఈ బ్రహ్మము ‘సచ్చిదానందమూర్తి’

 1. మనమా సచ్చిదానందమును చేరుటకు అజ్ఞానపు చీకటిని వదలి, వెలుగైన జ్ఞానము వైపునకు పయనింపవలెను.
 2. నిలుకడలేని, కదలాడు మనసులమైన మనము నిశ్చల మార్గమున, సత్తు ఎల్లవేళల నిలుకడ గల మనోస్థితి వైపునకు పోవలెను.
 3. మర్త్యులమైన మనము, మృత్యుజేతమవవలెను. ఆ దారిని వెతికి ఆ దారివెంట బోవలయును.
  “అసతోమా సద్గమయ
  తమసోమా జ్యోతిర్గమయ
  మృత్యోర్మాఽమృతంగమయ”

 

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: