All about Sama Veda – Chapter 5 (సామవేదీయ సర్వస్వము – పంచమార్చిక)

పంచమార్చిక

 

సత్యవ్రతశర్మణః

ఈయన నామధేయము సత్యవ్రతశర్మ. “భట్టాచార్యులు” సామవేదపండితలోకము సగౌరవముగా ఆయనపేరుతో పల్కెడు రీతి. అందరును ఆయనను వట్టి సత్యవ్రతశర్మ అనరు. గౌరవముగా, సత్యవ్రత భట్టాచార్యులు అందురు.

సాయణాచార్యుల వారి వేద సేవ

మనము సాయణుని, వట్టి సాయణుడు అనము. సాయణాచార్యులవారు అందుము. కారణము ఆయన వేదమునకు చేసిన సేవ మరువరానిది కావున.

వేదమునందు ఎన్ని భాగములున్నవో అన్నిటికిని భాష్యము వ్రాసెను. ఆయన భాష్యమునకు “వేదార్థదీపిక” అని పేరు.

ఆయన తన వ్యాఖ్యానమును ప్రధానముగా యజ్ఞకర్మ దృష్టితో వ్రాసెను. వేదము యజ్ఞకర్మను “బ్రహ్మకర్మ” యనును. “బ్రహ్మకర్మ సమారభే” అని కృష్ణయజుర్వేదము ద్వితీయానువాకము.

యజ్ఞమునందు, ఏ ఏ మన్త్రములను ఎప్పుడెప్పుడు పఠింపవలెను?

 

యజ్ఞ భాగములు

యజ్ఞభాగములకు “పర్వ”లని పేరు. ఒక యజ్ఞకర్మమునందు 1 పర్వనుండి 5-6 పర్వలు గూడనుండవచ్చును.

ఏ మన్త్రమును ఏ పర్వలో పఠింపవలెను? ఆరంభమునందా? మధ్యలోనా? చివరికా?

యజ్ఞమునందు దేవతలనాహ్వానించి, వారికి మన కామ్యేప్సితములను చెప్పి, వాటిని ఈడేర్పుమని ప్రార్థింతము. లోకములోగూడ నంతియే కదా! తిరుపతికిపోయి స్వామివారికి మ్రొక్కి, నా కోరికలు తీర్చుమని ప్రార్థించి, మనకు తోచినది, మన శక్తికొలది “హుండీ”లో వేతుము.

యజ్ఞకర్మయందు, పిలచిన దేవతను ప్రార్థించు మన్త్రములను పఠించి నా కోరికలను తీర్చుమని మనసులో ధ్యానించి, హవిస్సును దేవతలకిచ్చు ఘృతమును సృక్‍ సృవములతో అగ్నిలో వేసి, ప్రజ్వలించిన ఆ అగ్నిదేవతను, మనమిచ్చు ఘృతమును ఆయా దేవతలకిమ్మని ప్రార్థింతుము.

అందువలననే అగ్నిహోత్రుడు అందరు దేవతలకు హవిర్దాత. హవిస్సును ఆ యా దేవతలకు అందిచ్చువాడు. దేవతల ఋత్విక్కు, పురోహితుడు. అటులనే మన ఋత్విక్కు, మన పురోహితుడు.

 

ఋత్విక్కులు

“పురోహితుడు”‍ అనగా పురః హితుడు – భావికాలమున హితము గూర్చువాడు.

 

అ॒గ్నిమీ॑ళే పు॒రోహి॑తమ్ య॒జ్ఞస్య॑ దే॒వమృ॒త్విజ॑మ్ | హోతా॑రమ్ రత్న॒ధాత॑మమ్ |

अ॒ग्निमी॑ळे पु॒रोहि॑तम् य॒ज्ञस्य॑ दे॒वमृ॒त्विज॑म् |‍ होता॑रम् रत्न॒धात॑मम् |

– ఋగ్వేదము మొదటి మన్త్రము

అగ్నిదేవత పురోహితుడు, ఋత్విక్కు మాత్రమేగాక, దేవతలకును, మనకును “హోత”, రత్నధాతముడు. యజ్ఞమునందు ప్రధానముగ, నల్గురు (4) ఋత్విక్కులు.

 1. అధ్వర్యుడు – బ్రహ్మకర్మను చేయించువాడు
 2. హోత – బ్రహ్మకర్మను సేయువాడు
 3. ఉద్గాత్రుడు – బ్రహ్మకర్మయందు సామగానము సేయువాడు
 4. బ్రహ్మ – తక్కిన ముగ్గురు ఋత్విక్కులకు యీ యీ కార్యములను, యీ యీ మన్త్రములతో సేయుడు అని ఆజ్ఞాపించువాడు. ముగ్గురిమీద అధినేత.

కనుక అగ్నిదేవత, బ్రహ్మకర్మను సేయువాడు. బ్రహ్మకర్మను సేయునది మనము గదా! అనగా మనయందున్న అగ్నిహోత్రుడు బ్రహ్మకర్మను సేయుచున్నవాడు. మనమే అగ్నిదేవతలముగా భావించి బ్రహ్మకర్మను సేయవలయునని అభిప్రాయము.

అగ్నిదేవత, ఋత్విక్కు, హోతయే కాక, రత్నధాతముడు. మనకును, దేవతలకును రత్నములను (వెలలేని ధనములను)‍ ఒనగూర్చువాడు.

 

సాయణభాష్యము

ప్రతి ఋక్కును

 • హోత పఠింపవలెనా? లేక తక్కిన ఋత్విక్కులలో ఎవరు పఠింపవలెను?
 • ఆ ఋఙ్మన్త్రమును “పర్వ”యందు ఎప్పుడు పఠింపవలెను?
 • ఆ ఋక్కు దేవత ఎవరు?
 • ఆ ఋక్ఛందస్సు ఏమిటి?
 • ఏ శ్రౌత (వేదసంబంధమైన) సూత్రకారుడు ఆ ఋఙ్మన్త్రమును పఠింపవలెననెను?
 • ఏ శ్రౌతసూత్రకారుడు దానిని అంగీకరింపలేదు?
 • ఆ ఋక్కు ఏ దేవతాస్తుతి?
 • ఆ ఋగృషి ఎవరు?
 • అచ్చచ్చట ప్రధానమైనచోట సంధులు, వానికి సంబంధించిన వ్యాకరణ సూత్రములు, వలసిన చోట, పాణిని వ్యాకరణ శిక్షలనుండి వాక్యములనిచ్చెను.
 • పాతంజలీయమైన మహాభాష్యమునుండి references ఇచ్చెను
 • నిరుక్తమునుండి quotations ఇచ్చెను

ఈ విధమైన వ్యాఖ్యానమును, అన్ని సంహితలకు, అన్ని బ్రాహ్మణములకు, అన్ని ఆరణ్యకములకు, అన్ని ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానము వ్రాసెననగా, వాటి విలువ ఇంతని చెప్పతరమా?

ఇందువలననే ఆయనను మనము సగౌరవముగా “సాయణాచార్యు”లందుము.

 

సత్యవ్రతాచార్యులు

అటులనే సామవేదమునకు అనంతమైన సేవ జేసిన సత్యవ్రతశర్మ గారిని “సత్యవ్రత భట్టాచార్యు”లందురు. ఆయన సామవేదమునకు చేసిన సేవ ఇంతింతనరాదు. సత్యవ్రతభట్టాచార్యులు ఇంగ్లీషు చదువులో M.A. అయిఉండవలెను. కానిచో కలకత్తా విశ్వవిద్యాలయములో వేదశాఖకు ప్రధానిగా ఉండడు గదా! “Head of the Sanskrit Department, Calcutta University, And Professor for teaching Veda. He prepared many students for Ph.D. in Sama Veda.”

భట్టాచార్యులు “ప్రత్నకమ్ర నన్దినీ” (the delight of lovers of old things) అనిన పత్రికకు సంపాదకుడుగా నుండెను. అది ఆయన స్థాపించిన పత్రికయే. అది వంగభాషలో నడిపెనో, లేక సంస్కృతములో నడిపెనో, అది వార పత్రికో, పక్ష పత్రికో, మాస పత్రికో కూడ తెలియదు.

 

అధీతవేద

ఆయనకు వేదపండితలోకము “అధీత వేద” అనిన బిరుదునిచ్చి, తమకు తాము గౌరవించుకొనిరి. ఆ మహానుభావుడు సామవేదమును సాఙ్గముగా, సప్తస్వరముగా, పూర్వోత్తరార్చికా సహితముగా, మహా నామ్నార్చికాయుతముగా, స్తోభగానముతోడ, “వఙ్గసామగ”మనిన టీకతో, సామవేదమును సాఙ్గముగా పరిశోధించి ప్రకటించెను.

అందు ఊహాగాన, ఊహ్యగానములను గూడ సవిస్తరముగ ప్రకటించెను. పూర్వోత్తరార్చికలలోనున్న సామలలో ఏ సామ ఊహాగాన సంబంధి? అనిన విషయమును విపులముగ తెలియపరిచెను.

మొత్తము సామవేదమునందు ఏ ఏ సామలు ఋగ్వేదమునుండి విపర్యము చెంది సామలైనవి? ఏ ఏ సామలు అచ్చముగా సామవేద సామలు? మొత్తము సామలలో ఏ ఏ సామలు కృష్ణ యజుర్వేదమునందు, శుక్లయజుర్వేదమునందు, అథర్వవేదమునందున్నవి?

ఏ ఏ సామలు యజ్ఞకర్మయందు (బ్రహ్మకర్మ యందు) ఏ పర్వలో (పర్వ, యజ్ఞభాగము), ఏ ఋత్విక్కు పఠింపవలెను? పఠింపవలసిన పర్వయందు, ఆ సామను ప్రథమమునా?‍ మధ్యయా?‍ లేక చివరయా? అను విషయమును వెల్లడించెను.

సామగానమునందలి ఏ ఏ సామ ఏ ఏ యజ్ఞమునందు పఠింపవలెనో అనిన విషయము తెలియజేయు సమాచారము ఏ ఏ గ్రంథములందున్నది? తాండ్య మహాబ్రాహ్మణములో ఏ ఏ సామలనుగూర్చి వివరింపబడినది?

 

వేద మన్త్రములపేర్లు

ఋక్కునకుగాని, కృష్ణయజుస్సునకు గాని, శుక్లయజుస్సునకుగాని, సామకు గాని, అథర్వములకు గాని పేరులుండవు. వాటి మొదటి అక్షరములే వాటి పేరు.

 • ‘అగ్నిమీళే’ ఋక్కు – ఋగ్వేదఋక్కు పేరు
 • ‘ఇషేత్వోర్జమత్వే’ – కృష్ణయజుర్వేద ప్రథమ, యజుర్మన్త్రము పేరు
 • ‘అగ్న ఆయాహి వీతయే’ – సామవేద ప్రప్రథమ సామమన్త్రము
 • ‘యే త్రిషప్తాః పరియన్తి’ – ఇది బ్రహ్మవేదమైన అథర్వ లేక అథర్వణవేద ప్రథమాథర్వ మన్త్రము పేరు

ఇది వేదమన్త్రములయొక్క పేర్లు ఏర్పడిన విధానము.

ఇదిగాక, యింకొక పద్ధతిగూడ నున్నది. ప్రధాన యజ్ఞ – యాగములందు చివరకు చేయు కర్మ అవబృధ స్నానమందురు. అవబృధ స్నానము యజ్ఞాన్త స్నానము. దానికి ముందు కర్మతో యజ్ఞము పూర్తి చేసికొని, తరువాత, యజమాని, అధ్వర్యాది పదునారు (16) ఋత్విక్కులు స్నానము చేసి యజ్ఞదీక్షను వదులుదురు.

అవబృధ స్నానాత్పూర్వము సేయు కర్మయందు ఏ మన్త్రము పఠింతురో అదియే ఆ మన్త్రము పేరు.

సత్రమహాయాగము చివరి మన్త్రము యజ్ఞాయజ్ఞీయము. కనుక ఆ మహాయాగ చివరి పర్వ పేరును, ఆ మన్త్రము పేరును, యజ్ఞాయజ్ఞీయమే.

ఇది వేదమన్త్రములకు పేరులిడు రెండవ పద్ధతి. కాని యీ పద్ధతిగా పేరులిడిన మన్త్రములు బహుకొద్ది. ఎక్కువ మన్త్రములకు పేర్లు పెట్టినది మొదటి పద్ధతియే.

 

సామవేద విజ్ఞాన సర్వస్వము

భట్టాచార్య మహాశయుడు ప్రకటించిన సామవేదమునందు యిన్ని విషయముల వివరణ ఉన్నది. ఆయన పుస్తకమును నిజముగా “సామవేద విజ్ఞాన సర్వస్వము” – Encyclopedia of Sama Veda అనవలెను.

అందువలననే ఆయనకు “అధీతవేద” అనిన బిరుదును యిచ్చినారు. ఇవి అన్నియును గాక, ఆయన తన పుస్తకమునందు సాయణ భాష్యమును కూడ పొందుపరచెను.

ఆయన కలకత్తా విశ్వవిద్యాలయ ప్రచురణగా అచ్చువేసినది ఐదు భాగములు (5 Volumes). ఆయన దివంగతుడైన తరువాత, Munshi Ram Manoharlal Publishers Pvt. Ltd. – Post Box 5715, 54 Rani Jhansi Road, New Delhi 110055 వారు ప్రకటించిరి. పది ఏండ్ల క్రింద (2000) 5 వాల్యూముల కలిపిన ధర రూ. 1,750. ఇప్పుడు ఎంత ఉండునో తెలియదు.

సామవేదమును గూర్చి తెలియవలెననినచో యీ గ్రంథమును చూడవలెను.

Originally published in Bibliotheca Indica, Calcutta, 1871-78. New Series Nos. 339, 340, 342, 347, 348, 351 and 355.

నేను గూడ ఈ మహాగ్రన్థమును నా భాష్యము (అచ్యుత భాష్యము)‍సహితముగా ప్రకటింప ప్రయత్నించుచున్నాను. అది ‘నిర్విఘ్నముగా జరుగు గాత’ అని విఘ్ననాయకుని ప్రార్థించుటతో యీ పంచమార్చిక సంపూర్ణము.

 

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: