All about Sama Veda – Chapter 4 (సామవేదీయ సర్వస్వము – చతుర్థార్చిక)

చతుర్థార్చిక

 

అర్చికా విభాగముల క్రమము

నేను యీ సామవేదపరిచయ గ్రన్థమును క్రిందటి అర్చికలో వ్రాసినట్లు సత్యవ్రత సామశ్రమి భట్టచార్యగారు ప్రకటించిన “సామవేద సంహిత”ను అనుసరించి, ఆయన ఏ క్రమములో అర్చికావిభాగములను వ్రాసెనో, నేనును అదియే విధముగా వ్రాసితిని.

సామవేదావిర్భవకాలమునుండి, అనేకమంది వేదజ్ఞులు, అర్చికాక్రమములను ఒకేవరుసలో శిష్యులకు చెప్పలేదు. వారివారి క్రమములో శిష్యవర్గము పఠించుటవలన, సామవేదముయొక్క సామార్చికాక్రమము ఒకే పద్ధతిగాలేక, బహుపద్ధతులై, బహు సంప్రదాయములైనది. ఏ సంప్రదాయమువారు వారి సంప్రదాయమే శ్రేష్ఠమనుచుండిరి. కాని, అన్ని సంప్రదాయములందును, ఒక్కటిగూడ లోపించకుండ, అన్ని అర్చికలు, అన్ని సామలు ఉన్నవి.

సంహితాభాగములే

ఈ పైన చెప్పిన విభాగములైన అర్చికలుగాని మరి యితర విభాగములుకాని ఒక్క సామవేద సంహితకు సంబంధించినవి మాత్రమే. సామవేద బ్రాహ్మణారణ్యకోపనిషద్భాగములకును యీ విభాగములకును సంబంధము లేదు. వాటి విభాగములు వాటివే.

 

సామసంహిత ప్రాచీన వ్యాఖ్యానములు

సామసంహిత అవతరించిన నాటి నుండి, సామసంహితను అనేకమంది వ్యాఖ్యానించినారు. దేవరాజయజ్వ తను వ్రాసిన నిరుక్త భాష్యగ్రన్థభూమికయందు, తనకు తెలిసిన ఎనిమిదిమంది వ్యాఖ్యాతల పేరులను చెప్పెను.

ఆ ఎనిమండుగురి పేరులు – 1. స్కన్దః 2. భవః 3. మాధవః 4. భట్టః 5. మిశ్రః 6. శ్రీనివాసః 7. భరతః 8. యహశ్చః

 

దొరికిన వ్యాఖ్యానము

ఈ ఎనిమిదింటిలో సామశ్రమీ భట్టాచార్యునకు ప్రాచీనగ్రన్థములున్నచోటులందును వెదుకగా,  వెదుకగా, చివరకు ఒక్కటే ఒక్క వ్యాఖ్యానము దొరికినది. అది “మాధవీయ వివరణాఖ్యాయము”. ఆ దొరికినది జీర్ణ శుద్ధపుస్తకమని భట్టాచార్యులు వ్రాసెను.

ఇంతవివరముగా ఎందుకు వ్రాయుచుంటిననగా వేదములు, వేదవిజ్ఞాన గ్రంథములు, భారతదేశమునందనేకములున్నవి. అవి అన్నియు – “జీర్ణశుద్ధములు” కాకమునుపే, మైక్రోఫిల్ములలోను, క్యాసెట్లలోను, కంప్యూటరు మెమరీలలోను భద్రపరచుట చాల అవసరము. వేదవేదాంగ శాస్త్ర విజ్ఞానమతులను వేదమునకు యీ సేవసేయుమని నా వినతి, ప్రార్థనలు.

భట్టాచార్యునకు దొరికిన పుస్తకమునకు రెండు అట్టలును లేవు. ఈ పుస్తకమును “టిప్పణి”వలె ముద్రించిరి అని భట్టాచార్యుని మాట.

దేవరాజయజ్వ తన భూమికలో వ్రాయుట వలననే, యీ పుస్తకమయినా దొరికినది కానిచో నిదియును దొరికెడిది కారు.

అనగా భట్టాచార్యుని ఉద్దేశము, వేదవేదాంగ శాస్త్రములను గురించిన గ్రంథములను వ్రాయువారు, తాము వ్రాయు గ్రంథమునందు, తాము ఎరిగిన గ్రన్థములనుగాని, తనకు పరిచయమున్న గ్రన్థములను గూర్చిగాని ఉదహరించినచో, భావికాల గ్రన్థకర్తలకు, ఇతర పండితులకు వీలుగానుండును. ఈ కాలపు గ్రన్థకర్తలు యీ విషయమును జ్ఞప్తియందు ఉంచుకొని, తదనుకూలముగా వ్రాయుమని ప్రార్థన.

 

సాయణుని క్రమము

సాయణుని మతము ప్రకారము, ఆరణ్యకము, ఛన్దోగ్రన్థాంతర్భూతము [సాయణ ఋగ్వేదభూమిక 61వ పుట].

అనగా సాయణుని ఉద్దేశ్యము ఛన్దోగ్రన్థమునందు ఒక్క ఆరణ్యకమే ఉన్నది. పూర్వార్చిక, ఉత్తరార్చికలు వేరు. అనగా సంహితాప్రధాన విభాగములు మూడు – 1. ఛందోగ్రన్థము (ఆరణ్యకము) మాత్రమే 2. పూర్వార్చిక 3. ఉత్తరార్చిక.

ఇది సాయణుని అభిప్రాయమై ఉండవచ్చునని నా ఊహ. భట్టాచార్యులు తనకాలమునందలి పండితులతో ప్రసంగించి, ఏమి నిర్ధారణకు వచ్చెననగా, ఛందార్చిక, పూర్వార్చిక కలసి ఒకటే విభాగమనియు, ఉత్తరార్చిక రెండవ విభాగమనియు.

అందువలన సత్యవ్రత సామశ్రమి తన “సామవేదసంహిత”ను పైన  చెప్పిన రెండుభాగములుగనే ప్రకటించెను.

 

ఈ విభాగములకెందుకింత ప్రాముఖ్యత?

(అ) ఈ విభాగములయందు:

 1. అగ్నిస్తోత్ర సామలు
 2. ఐన్ద్రస్తోత్ర సామలు
 3. పావమాన సామలు
 4. గ్రామేగేయ గానములు
 5. గ్రామేఅరణ్య గానములు

అన్నియు కలసియున్నవి.

(ఆ) ఇవిగాక

 1. తార్‍క్ష్య నుతులు
 2. దధిక్రావ్‍ణ్ణములు
 3. ద్యావాపృథివీ నుతులు
 4. వేనములు
 5. వాజినము
 6. వరుణదేవతా నుతులు
 7. సదసస్పతులు
 8. సవితాస్తోత్రములు
 9. సరస్వతీనుతులు
 10. సూర్యములు
 11. సోమములు
 12. ఋభవములు
 13. భర్గములు (భర్గోదేవ నుతులు)

(ఇ) ఇందులో కొన్ని

 1. హోతృ పాఠనములు
 2. ఉద్గాతృ పాఠనములు
 3. అధ్వర్యు పాఠనములు
 4. బ్రహ్మ, తక్కిన ఋత్విక్కులకు ఇచ్చు ఆజ్ఞా మన్త్రములు

ఇన్నివిధములైన సామల “కలగలపు”లో ఏ సామకు ఏ అర్థము చెప్పవలెను? మనమా సామను పఠించువేళ మనము అధ్వర్యులముగా నూహింపవలెనా? లేక హోతగానా, లేక ఉద్గాతగానా, లేక బ్రహ్మమానసులవలెనా?‍అనిన సందేహమేర్పడును.

మనము సామలను పఠించునపుడా యా సామలయందున్న దేవతలను మనసునందుంచుకొని, ధ్యానము సేయనిదే, తాదాత్మ్యత లేదు. తాదాత్మ్యత, సంయోగము, మమైకత్వములేనిదే, చారితార్థ్యము లేదు.

మనము పలుకునది గ్రామేగేయగానమా? లేక గ్రామే అరణ్యగానమా? అన్నది ముఖ్యము. గ్రామమనగా పల్లెటూరు, అరణ్యమనగా అడవి, అని పాశ్చాత్యులేగాక, మన కాలేజీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు గూడ చెప్పుచున్నారు. అది న్యాయముగాదు.

‘గ’కారము, దేవతాసంబంధమైన కార్యమును సూచించును. అనగా “బ్రహ్మకర్మము”. యజుర్వేదసంహితయందు “యజ్ఞము” అనిన అర్థమునందుపయోగింపబడినది.

మనము ఋక్కునుగాని, సామనుగాని, యజుస్సునుగాని, అథర్వమునుగాని పఠించుట బ్రహ్మకర్మ అనగా యజ్ఞము.

‘గ్రామ’ శబ్దమునందు ‘గ్రా’ అను అక్షరము బ్రహ్మకర్మ – యజ్ఞమును సూచించును. ‘మ’ – మనస్సు. అనగా మనస్సును, చేయుచున్న బ్రహ్మకర్మమునందు, యజ్ఞమునందుంచుట అని అర్థము.

అటులనే ఆరణ్యకము.

‘ఆ’ – మన వాగ్యంత్రమునుండి వచ్చు ప్రథమాక్షరము. ప్రాణి తన ఊహను తెల్పు నిచ్ఛతో వాగ్యంత్రమును నియమించు యత్నము.

‘ర’కారము, ‘ఋ’కార సమానము.

‘ణ’కారము, ‘న’కార సమానము. కాని యీ ‘ర’కార, ‘ణ’కారములు యజ్ఞసంబంధములు, వట్టి పఠనాక్షరములు కావు

‘క’కారము కార్యసంబంధి

“ఆరణ్యకము” మన ఊహను యజ్ఞసంబంధిని సేయుట. అనగా యజ్ఞదీక్షను పొందుట.

“గ్రామ్యము” యజ్ఞమును సేయ నిశ్చయించుట.

“ఆరణ్యకము” యజ్ఞదీక్షను పొందుట

శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదములు సరిగా యీ విషయములనే సంపూర్ణముగా వివరించుట. శుక్లయజుర్వేదము మనస్సుతో ఊహించుట, కృష్ణయజుర్వేదము కరచరణాద్యవయవములతో పని (యజ్ఞము)‍ సేయుట – సరిగా గ్రామ్యారణ్యకములు. మనస్సుతోనూహించుట, ఊహించినదానిని క్రియారూపమునకు తెచ్చుటలను చెప్పును.

గ్రామేగేయగానములు, గ్రామేఅరణ్యగానములు ఈ రెండువిధములైన మానసిక స్థితులలో మనముండి పఠింపవలెనని అర్థము.

అపుడే తాదాత్మ్యము. మన జ్ఞానకోశమునందు పైమెట్టెక్కుట.

ఇట్లు ఎన్ని జన్మలలో, ఎన్నిమెట్లెక్కొన తరువాత, మనము బ్రహ్మైక్యమును చెందుదుమో చెప్పలేము కదా! అది మన పూర్వజన్మ పరిపాకమును బట్టి ఉండును.

బ్రహ్మైక్యమైతిమా, యింక మనము లేము, మన మనశ్శరీరజీవాత్మలుండవు. సర్వము బ్రహ్మము.

అహం బ్రహ్మాఽస్మి.

ఏకమేవాఽద్వితీయం బ్రహ్మ.

 

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: