All about Sama Veda – Chapter ౩ (సామవేదీయ సర్వస్వము – తృతీయార్చిక)

తృతీయార్చిక

క్రిందటి అర్చికను సామవేద బ్రాహ్మణమైన ఆర్షేయబ్రాహ్మణ మన్త్రోదాహరణముతోడ ముగించినాము.

యజుర్వేదము, రెండు రూపములతోనున్నది గదా! అవి 1. శుక్లయజుర్వేదము 2. కృష్ణయజుర్వేదము.

అటులనే సామవేదము గూడ రెండు రూపములతో విరాజమానమగుచున్నది.

 1. కౌథుమ శాఖ
 2. జైమినీయ శాఖ

మరియొక పేరు

సామవేదమునకు ఇంకొక పేరు ఉన్నది. అది సామపేటిక. సామమొక పెద్ద పెట్టె. భోషాణము.

అందనేక సామగాన మన్త్రమణులున్నవి. వాటిని ఒకటొకటి బహటకు తీసి చూపటయే యీ ‘సామవేద పరిచయ’ గ్రంథోద్దేశము.

కలకత్తా నగరమందు నేనొక సామవేద పండితుని వద్దకేగితిని. ఆయనతో పరిచయము చేసికొనుటకు నేను వెళ్లితిని. పరిచయమైన తరువాత “అయ్యా! నా వద్ద ఊహగాన, ఊహ్యగాన గ్రన్థములు వేరుగా లేవు. మీవద్ద ఉన్నచో నాకిచ్చినచో, నేను వాటిని వ్రాసుకొని, లేక జిరాక్స్ చేసుకొని మీకు తిరిగి యిత్తునంటిని. ఆయన నేనా పుస్తకమీయననెను.

నేను ఎందువలన యీయరంటిని. ఆయన “అయ్యా! సామవేద భాగ గ్రన్థములు కావలెనని అనేకమంది వత్తురు. వారెవరికిని సామవేదమును గురించి తెలియదు.

వారు సామవేదమును గూర్చి అనేకములైన తప్పులను వ్రాయుదురు. ఋక్కును చదువునపుడు, దానిని సాగదీసి కూనిరాగము తీసినచో, దానిని ‘సామము’ అందురు. దానిని ‘సామవేదము’ అందురు. అదియే సామవేదము కాని వేరుగా సామవేదము లేదు.

నా దగ్గరకు వచ్చి, నావద్దనున్న సామవేద భాగములను కొనిపోయి, అట్టి పిచ్చి పిచ్చి వ్రాతలు వ్రాసిన వారిని నేనెరుగుదును.

అందువలన నేను, అడిగిన ప్రతివారికినీ నావద్దనున్న సామవేదభాగములను చూపుట మాని వేసితిని. సామవేదము బ్రహ్మముయొక్క గాన స్వరూపము. బ్రహ్మము, వాక్కుగా, క్రియగా, గానముగా, అచ్చమైన బ్రహ్మముగా నవతరించినది. అది బ్రహ్మముయొక్క నైజము.

ఆ సనాతన, సచ్చిదానందమైన బ్రహ్మమును గూర్చి నుతులు ఋగ్వేదము.

క్రియారూపము యజుర్వేదము.

మనయందు క్రియ ఎల్లవేళల రెందు విధములు. ఒకటి మనస్సుతో ఊహించుట. ఇది మనో క్రియ. దానిని వివరించునది శుక్లయజుర్వేదము. రెండు కరచరణాద్యవయవములతో సేయుట. ఈ క్రియా విధానమును సూచించునది కృష్ణయజుర్వేదము.

మూడవది గాన రూపము. అదియే సామవేదము. ఆ గానమనేకవిధములు. మనము గానములను, పాటలను ఒక్క విధముగా పాడుదుమా? అనేక రాగములలో అనేక విధములుగా పాడుదుము. ఈ సర్వ విధములను సంపూర్ణముగా వివరించునది సామవేదము.

చాలమందికి సామవేదమొక పేటిక అనియు, ఆ పేటిక భోషాణములో అనేకములైన వజ్రములు, రత్నములు, మాణిక్యములున్నవి గదా! వాటియొక్క విలువ తెలియని వారికా గ్రన్థములు చూపి ఏమి ప్రయోజనము? అందువలన నేను మీకా గ్రన్థములీయను” అనెను.

నేనాయనకు “అయ్యా! నేనందరివలె కాదు. నాకు నాలుగువేదముల పరిచయమున్నది. అవతరించిన నాలుగు వేదములలో ఋగ్వేదము ప్రథమమను సిద్ధాంతము వారు కొందరు. లేదు యజుర్వేదమే వేదారంభమని మరి కొందరు. రెండవ రకము వారిలో, తిరిగి రెండు రకములు. శుక్ల యజుర్వేదులు, శుక్లయజుర్వేదము కృష్ణమునకు పూర్వమని, కృష్ణయజుర్వేదమతము వారు కృష్ణమే ముందు, శుక్లము తరువాతయని. వీరిరువును తక్కిన వేదములు తరువాత పుట్టినవందురు.

సామసంహిత వాదులు, సామమే మొదట ఆవిర్భవించినదందురు.

అథర్వులు – అథర్వవేదమే పంచవేదములకారంభమందురు.
నేను సామసంహితావాదిని.

దయచేసి ఊహగాన, ఊహ్యగాన గ్రన్థములను నాకీయ ప్రార్థన. నేను కాపీ చేసుకొని మీకిత్తు” నంటిని.

అప్పుడాయనకు, నాయందు నమ్మిక కలిగి నన్ను వారియింటిలోని క్రింద భాగమునకు కొనిపోయి అందు ఉన్న భోషాణము తలుపు తెరచి, అందు, ఎర్రని గుడ్డలలో వేరు వేరుగా చుట్టబడిన ఊహగాన, ఊహ్యగాన గ్రన్థములను నాకిచ్చెను.

నేను వాటిని కాపీ చేసుకొని, ఆయన గ్రన్థములను ఆయనకిచ్చితిని.

ఆ ఊహగాన ఊహ్యగానములను, నా భాష్యముతో – అచ్యుత భాష్యముతో ప్రకటింపబోవుచున్నాను.

పేటికలోని గ్రంథములు

ఆ పేటికలో సామవేదమునకు సంబంధించిన అనేక గ్రంథములున్నవి. సామ సంహితా భాగములు – బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు, ప్రాతిశాఖ్యములు, భాష్యములు – ఒకటేమిటి! ఆ భోషాణము సామవేద గ్రన్థమాల!

ఆ రెండు గ్రన్థములను, వెనువెంటనే ఇచ్చుటచేత, నాయందాయనకు నమ్మకము కుదిరినది. ఆయన దయవలన, అనేకమైన సామవేద సంబంధమైన గ్రన్థములను సంపాదింపగలిగితిని.

సామసంహితా భాగములు

సామ సంహిత ప్రధానముగ రెండు భాగములుగ విభజింపబడినది:

 1. కౌథుమ శాఖ
 2. జైమినీయ శాఖ

ప్రథమమున కౌథుమశాఖ యందున్న అన్నిభాగములను చెప్పి, తరువాత జైమిని శాఖా భాగములకు పోవుదును.

కౌథుమశాఖ కానిమ్ము, జైమిని శాఖ కానిమ్ము, ప్రధానముగ సామవేదమునందున్న మన్త్రములు – సామములు.

సామవేద సంహితయందున్న సామలు అయిదు విధములు:

 1. ఋగ్వేద సామలు:
  ఇవి ఋగ్వేదమునందలి ఋక్కులు. సామవేదమునందు విరాజమానమగుచున్న సామలు.
 2. కృష్ణయజుర్వేద సామలు:
  ఇవి కృష్ణయజుర్వేదమందలి యజుస్సులు. సామవేదమునందు విరాజమానమగుచున్న సామలు.
 3. శుక్లయజుర్వేద సామలు:
  ఇవి శుక్లయజుర్వేదమందలి యజుస్సులు. సామవేదమునందు విరాజమానమగుచున్న సామలు.
 4. సామవేద సామలు:
  ఇవి సామవేదమునందు మాత్రమే విరాజమానమగుచున్న సామలు.
 5. అథర్వవేద సామలు:
  ఇవి అథర్వవేదమందలి అథర్వములు. సామవేదమునందు విరాజమానమగుచున్న సామలు.

కౌథుమ శాఖ

కౌథుమశాఖలొని సామసంహిత రెండు భాగములు:

 1. పూర్వార్చిక
 2. ఉత్తరార్చిక

పూర్వార్చికలోనున్న సామలు:

 1. ఆగ్నేయ సామలు
 2. ఐన్ద్ర సామలు
 • పావమాన సామలు
 1. ఆరణ్యక సామలు
 2. భారణ్డ సామలు
 3. తవాశ్వావీయ సామలు

పూర్వార్చికలోనున్న గానములు:

 1. గ్రామేగేయ గానము

ఉత్తరార్చికలోనున్న గానములు:

 1. ఊహ్యగానము

సామవేద సంహితాభాగముల మొత్తము

సామవేద సంహిత మొత్తము 13 భాగములు.

 1. పూర్వార్చిక:
 2. ఛన్దః
 3. ఆరణ్యకః
 4. మహానామ్నః

ఇవి పూర్వార్చికనందున్న ప్రధానభాగములు

 1. ఉత్తరార్చిక:
 2. స్తోభగ్రన్థః
 3. గేయమ్
 4. ఆరణ్యమ్
 5. ఊహమ్ – ఊహ్యమ్
 6. మహానామ్నమ్
 7. భారణ్డమ్
 8. తవాశ్వావీయమ్
 9. గాయత్రమ్

ఉత్తరార్చికయందు మొదటి నాలుగును అర్చికగ్రన్థములు. ఈ నాలుగును ప్రధాన గ్రన్థములు. చివరి నాలుగును పరిశిష్టములు. ఈ ఎనిమిదియును గానగ్రన్థములు.

సామసంహిత అని మనము వ్యవహరించుచున్న సామవేదమునందు యీ 13 భాగములు ఉన్నవి. అవి:

 1. ఆగ్నేయ సామలు
 2. ఐన్ద్ర సామలు
 3. పావమాన సామలు
 4. ఆరణ్యక సామలు
 5. గ్రామేగేయము, గ్రామే అరణ్య గానము, స్తోభగానము, భారణ్డ సామలు, తవాశ్వావీయ సామలు అను సామలు
 6. స్తోభ గ్రన్థః
 7. గేయమ్
 8. ఆరణ్యమ్
 9. ఊహమ్ – ఊహ్యమ్
 10. మహానామ్నమ్
 11. భారణ్డమ్
 12. తవాశ్వేయమ్
 13. గాయత్రమ్

ఈ పదమూడు భాగములను కలసి మనము సామవేద సంహితగా వ్యవహరించుచున్నాము.

జైమిని మహర్షి వ్రాసిన “సామ లక్షణ”‍గ్రన్థమునందు, అర్చిక గ్రంథములను “సామవేదము”‍ అనినాడు [ఒకటవ అధ్యాయము, ఒకటవ పా||, 34వ సూ||]

బహుశః ఆయన ఉద్దేశ్యమునందు, “తక్కిన సామవేదములోని సామలు, ఋగ్వేదమునందలి ఋక్కులే గదా! మిగిలిన గానగ్రంథములే సిసలైన సామవేదము” అయిఉండవచ్చును. ఏమైనను, తక్కిన ఋక్కులు, ఆ ఋక్కులబోలిన సామలు యజ్ఞకర్మల యందు పఠింతురు. ఈ గానార్చికలను ప్రత్యేకముగా గానము సేయుదురు. ఈ ప్రత్యేకముగా గానము సేయు అర్చికలను ఏ ఏ యజ్ఞములందు ఏ ఏ కాలమునందు పఠింపవలెనో తాండ్య మహాబ్రాహ్మణమునందు వివరింపబడినది.

ఈ గ్రంథరచనా విధానము

ఋగ్వేదమునందలి ఋక్కులు వైదిక యజ్ఞస్వరూపమును వివరించునని రైవతాది సమాఖ్యలుగూడ చెప్పుచున్నవి.

‘వేదదీపిక’ అను పేరుతో సాయణాచార్యుడు వ్రాసిన భాష్యమునందు (1వ భాష్యము, 86వ పుట), మాధవాచార్యుని వివరణాత్మకమైన భాష్యమునందును, అర్చకములకొరకు సామలను సంపాదించి తీరవలయునని పేర్కొనబడినది. దానజేసియే అర్చికమూలకమైన గేయగానమును వ్యాఖ్యానించినామని వారనిరి. అందువలననే నేనుగూడ అర్చికలను వేరుగా, ప్రత్యేకముగా, నా అచ్యుతభాష్యముతో ప్రకటించుచున్నాను.

ఆరణ్యకమూలమైన ఆరణ్యగానము స్తోభగానము, పరిశిష్టము.

ఋగ్వేదమును భగవానార్థ్యాగమమని గూడ పిలుతురు. దానినిగూడ ప్రకటింతును. ఉత్తరార్చికమూలమైన ఊహగానమును, దశరాత్రపర్వమును, సామానుస్మృతమైన చయన పర్వమును కూడ ప్రకటించుచున్నాను. ఉత్తరార్చిక పరిశిష్టరూపమైన స్వస్తి వాక్యములను గూడ ప్రకటింతును.

స్తోభగానములున్న గ్రంథమును ‘స్తోభ’ అనియే పిలుతురు.

వీటినన్నియును – ఈ క్రింది మూడు గ్రన్థములను పరిశీలించి, జాగ్రత్తగా ఆ మహాగ్రన్థములననుసరించి నా యీ గ్రన్థమును వ్రాయ పూనినాను. ఆ మూడు గ్రన్థములు: సాయణుని వేదార్థదీపిక, న్యాయమాల, శ్రీ సత్యవ్రత సామశ్రమి భట్టాచార్య కృతములైన భాష్యగ్రన్థములు.

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: