All about Sama Veda – Chapters 1 & 2 (సామవేదీయ సర్వస్వము – ప్రథమ, ద్వితీయార్చికలు)

“సామవేదీయ సర్వస్వము” or “All about Sama Veda” is book written by late Sri. Rayalu Vishwanadha, in Telugu. This book is divided into multiple chapters, named “Archikas”.

This book will be published on this blog as a series of posts. All posts belonging to this book will be categorized under “Telugu, Sama vediiya sarvasvamu – సామవేదీయ సర్వస్వము”

అవిఘ్నమస్తు

శ్రీరస్తు

విఘ్నేశ్వరాయనమః

శుభమస్తు

 

“సామవేదీయ సర్వస్వము 1 అనిన గ్రంథమును వ్రాయుట: వికృతినామ సంవత్సర, ఆషాఢ మాస, శుద్ధ తదియా బుధవారమునాడు (July 14, 2010) ప్రొద్దున 7:30 గంటలకు ఆరంభించినాను”

అవతరించిన వేదమునకు, అందలి వాక్యములకు నమస్కరించి, సాక్షాద్బ్రహ్మంబైన వేదాక్షరమునకు ప్రణమిల్లి నేను వ్రాయబోవు సామవేదసర్వస్వగ్రంథారంభంబెట్టిదనిన…

ప్రథమ, ద్వితీయార్చికలు:

ఓ౩మ్ అగ్న ఆ యాహి వీతయే గృణానో హవ్యదాతయే | ని హోతా సత్సి బర్హిషి || ౧ ||

samaveda-1stMantra

ఇది సామవేద ప్రప్రథమ సామ.

1. వేదములు:

వేదములు నాలుగు కదా! అవి: 1. ఋగ్వేదము 2. యజుర్వేదము 3. సామవేదము 4. అథర్వవేదము.

యజుర్వేదము రెండు భాగములుగా విరాజిల్లుచున్నది. మొదటిది శుక్లయజుర్వేదము. రెండవది కృష్ణయజుర్వేదము.

అందువలన వేదములు ఐదు (5) అని చెప్పవచ్చును.

2. మన్త్రముల పేరులు:

  1. ఋగ్వేద మన్త్రములు ఋక్కులు
  2. శుక్లయజుర్వేద మన్త్రములు శుక్ల యజుస్సులు
  3. కృష్ణయజుర్వేద మన్త్రములు కృష్ణ యజుస్సులు.శుక్లయజుస్సులు, కృష్ణయజుస్సులు చాలవరకు ఒక్కటే, కాని ఉదాత్తానుదాత్తస్వరితోచ్చరణలో ఏ అక్షరమునందైన భేదము ఉన్నదా? అని విచారింపవలెను. ఉన్నచో దాని ప్రయోజనమును గూర్చి యోజింపవలెను.
  4. సామవేద మన్త్రములు సామలు
  5. అథర్వవేద మన్త్రములు అథర్వణములు లేక అథర్వలు

3. ప్రధాన వేద భాగములు:

ప్రధానముగ, ప్రతివేదముయును, నాలుగు భాగములుగా శోభించుచున్నది.

3.1. సంహిత:

ఇందు వేదశబ్దములు కలసి (సంధులై) అనగా సంహితలై కూడియుండి – 2, 3, 4, లేక 5-6 శబ్దములు సమైక్యమై ఒక వాక్యముగా భాసిల్లును. అందు మనము గ్రుక్క తిప్పుకొనుటకు సాధ్యమైనంత కాలమున ఉచ్చరింపగలిగిన శబ్దముల కూడికయే ఉండును. దాని మించి ఉండదు.
వేదము సకల మానవ స్వరూపము అందరకు తెలియజేయుటకు కదా అవతరించినది! మనము ఎంతకాలము ఎన్ని అక్షరములను సువిస్పష్టముగా పలుకగలమో, వేదవాక్యము తెలుపును.
ఏడు, ఎనిమిది శబ్దములు కలసి ఒకే వాక్యముగా విరాజమానమగు వాక్యములకు ఉదాహరణలు:

1. యో మి॒త్రాయ॒ వరు॑ణా॒యావి॑ధ॒జ్జనో॑ఽన॒ర్వాణం॒ తం పరి॑ పాతో॒ అంహ॑సో దా॒శ్వాంసం॒ మర్త॒మంహ॑సః ।

यो मि॒त्राय॒ वरु॑णा॒यावि॑ध॒ज्जनो॑ऽन॒र्वाणं॒ तं परि॑ पातो॒ अंह॑सो दा॒श्वांसं॒ मर्त॒मंह॑सः ।
– ఋగ్వేద సంహిత 1 అ – 136 సూ – 5 మం
2. ధ్రు॒వ॒సద॑న్త్వా నృ॒షద॑మ్మనః॒ స॑దముపయా॒మగృ॑హీతో॒ఽ సీన్ద్రా॑య త్వా జుష్ట॑ఙ్గ్రృహ్ణామ్యే॒ష తే॒ యోని॒రిన్ద్రా॑య త్వా॒ జుష్ట॑తమమ్ ।

ध्रु॒व॒सद॑न्त्वा नृ॒षद॑म्मनः॒ स॑दमुपया॒मगृ॑हीतो॒ऽ सीन्द्रा॑य त्वा जुष्ट॑ङ्ग्रृह्णाम्ये॒ष ते॒ योनि॒रिन्द्रा॑य त्वा॒ जुष्ट॑तमम् ।
– శుక్లయజుర్వేద సంహిత; నవమోధ్యాయము, రెండవ మన్త్రము

3.2. బ్రాహ్మణము:

వేదము ప్రధానముగ, సృష్టిని సృజించు బ్రహ్మమూయొక్క నిత్య కారణ కర్తృత్వమును సుసంపూర్ణముగ, సువిస్పష్టముగ, నిస్సంకోచముగ నిర్వచించును. ఇందు ఆ బ్రహ్మభావనా విచారణ ఉండు గాన, ఇది బ్రాహ్మణము.
“దేవావై యజ్ఞ మతన్వత”
– ఐతరేయ బ్రాహ్మణము, సప్తమోధ్యాయము, మొదటి మన్త్రము

దేవతల కొరకు యజ్ఞము చేయబడును.
దేవతల కొరకే యజ్ఞము సేయుట. దేవతలు అనగా మనకంటే అధికులు. అధికమైన శక్తులు కలవారు. మనము వారిని మన కోరికలను పూర్తి సేయుమని యజ్ఞములు సేతుము. అనగా పిలిచి, ఆహ్వానించి సమన్త్రయుక్తముగా అర్థింతుము. ఇదియే యజ్ఞము. మనము గుడికి పోయి లోనున్న విష్ణువునో, శివునో, మన కోరికలనీడేర్పమని అర్థించుట లేదా? అదియే యజ్ఞము. ఈ యజ్ఞము మానవుడు పుట్టిననాటి నుండి ఈ రోజువరకు జరుగుచునే ఉన్నది. ఇకముందు గూడ జరుగును. కాకపోయిన, కాలమును బట్టి సేయు విధానము కొంచెము మారుచుండును. కాని తత్తతః – యజ్ఞము ఒక్కటియే.
ఈ యజ్ఞబుద్ధి మానవ సహజము. ఇదియే మనలోనున్న బ్రహ్మము, మన చేత చేయించుచున్నది. అందువలన, సర్వమానవ సహజమైన “యజ్ఞక్రియాభిలాష” బ్రహ్మచయిదము.

3.2.1. ఋగ్వేద బ్రాహ్మణము:

ఐతరేయ బ్రాహ్మణము, ఋగ్వేద బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణమునకు “షడ్గురు శిష్య” అనిన వేద పండితోత్తముడు వృత్తి – అనగా భాష్యము, వ్యాఖ్యానము వ్రాసెను. ఈయన తన భాష్యమునకు “సుఖప్రదా” అని నామకరణము చేసినాడు. ఐతరేయమును చదువుటను తన వృత్తి సుఖప్రదమును సేయునట!
ఋగ్వేదమునకు ఇంకొక బ్రాహ్మణమున్నది. దాని పేరు కౌషీతకి బ్రాహ్మణము.

3.2.2. సామవేద బ్రాహ్మణము:

సామవేదమునకు ఎనిమిది (8) బ్రాహ్మణములున్నవి. ఐదు వేదములకును ఉన్న బ్రాహ్మణములనన్నిటిని వేరుగా, పట్టికగా వివరింతును. ప్రస్తుతము బ్రాహ్మణములకు ఉదాహరణములిచ్చుచుంటిమి కదా!
సామవేదమునకున్న బ్రాహ్మణములలో ఆర్షేయ బ్రాహ్మణమొకటి. ఆ బ్రాహ్మణమునకు సాయణాచార్యులు, ‘వేదార్థప్రకాశము’ అను భాష్యము వ్రాసెను. సాయణుడు వేదములన్నిటికి (సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులన్నిటికిని) భాష్యము వ్రాసెను.
సాయణభాష్యమే లేనిచో, వేద సంహితయందు ఏమి ఉన్నదో ఎవ్వరికిని తెలిసెడిది కాదు. వేదారామము అతి విశాలమైనది. ఆ మహారామమందేది ఎచ్చటనున్నదో, ఏ మన్త్రమునకు ఏమి ప్రయోజనమో, ఆ మన్త్రమును ఏ యజ్ఞ పర్వమునందు ఉపయోగింతురో తెలియవలెననినచో, సాయణుని భాష్యమే శరణ్యము. అన్ని యజ్ఞములు పర్వములుగా విభజింపబడి ఉన్నవి. ఆ మన్త్రము పర్వారంభమునందో, పర్వ మధ్యమునందో, పర్వాంతముననో తెలియవలెననిచో సాయణాచార్యులవారి భాష్యమును చూడవలెను.

ఆర్షేయ బ్రాహ్మణమునందలి మొదటి మన్త్రము:
“అథ ఖల్వయమర్షః ప్రదేశో భవతి”

ఈ మంత్రమునందలి పదముల అర్థము చూతము:

1. అథ –

ఇత్యనంతర్యే అని సాయణుడు. “దీని తరువాత” అని అర్థము. దేని తరువాత? ఇది సకల మానవ సహజమైన ప్రశ్న. “అమ్మయ్య! ఇంక ఇప్పుడిక ఏమి చెయ్యవలెను” అని మనము ఒక పని అయిన తరువాత కూర్చొని, చేతులు దులుపుకొని అనుకొనెడు మాట. మానవుడు బ్రతికి ఉన్నంతవరకు, భౌతిక శరీరాంగములైన కాలు, సేతులు, కళ్లు, ముక్కు మొదలగు అవయవముల ద్వారానో, లేక మనస్సుతోడనో ఏదియో ఒకపని చేయుచునే ఉండును. మానవునకు ఉన్న అంగములు పది.
ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము – ఇవి ఐదు
కన్నులు, ముక్కు, చెవులు, చర్మము, కాళ్లు, చేతులు – ఇవి ఆరు
(పై ప్రాణములైదింటిని కలిపి మనము “ప్రాణము” అనుచున్నాము)
మానవునకున్న అంగములు తిరిగి చెప్పుచున్నాను: 1. కన్నులు 2. ముక్కు 3. చెవులు 4. చర్మము 5. కాళ్లు 6. చేతులు 7. ప్రాణము 8. అపానము 9. వ్యానము 10. ఉదానము 11. సమానము
ఈ పదకొండింటితో లోనున్న జీవుడు – “నేను” అనిన వ్యక్తి, “నా కొరకు” అనిన ఊహతో ఆ జన్మాంతము ఏదియో ఒక పని – యజ్ఞము, కర్మ – సేయుచుండును.
“బ్రహ్మము” ఈ కర్మలను జీవిచేత బ్రతికిఉన్నంత వరకు చేయించుచునే ఉండును. కనుక ఇది బ్రహ్మముయొక్క పని – బ్రాహ్మణము.

2. ఖలు –

“ఖల్వితి ప్రసిద్ధౌ” అని సాయణుడు. ప్రసిద్ధమైనది, అందరకును తెలిసినది.

3. అయమ్ –

“బ్రాహ్మణేన ప్రతిపద్యేఽర్థః” అని సాయణుడు. ప్రసిద్ధమై అందరకు తెలిసినది, ఒక పని తరువాత ఏమి సేయవలయుననిన ప్రశ్నను పుట్టించినది “బ్రాహ్మణము” అని అందరకు తెలిసినదే. బ్రహ్మము యొక్క పని అందరకును తెలియును.

4. ఆర్షః –

“ఋషి సంబన్ధీ” అని సాయణాచార్యులు. ఈ పని అయిపోయినది. తరువాత పని ఏమిటి? అని మనలో ప్రశ్న పుట్టించునది బ్రహ్మము. ఆ ప్రశ్నను పుట్టించునది బ్రహ్మమని మనకు ఎట్లు తెలియును? మనలోనున్న “ఋషి” భావము చెప్పును.
మనలో ఋషిభావమున్నది. “ఋ” అనగా ప్రయత్నము లేకుండ బయటకు వచ్చుటకు ప్రయత్నించు కంఠధ్వని. “స”కారము మన సుస్థితి. ఆందోళన లేని శాంతమైన మనస్స్థితి. నాకు సంబంధించిన ఊహ కాక, దైవపరముగా నూహించువేళ, వేదము “ష”కారమును ఉపయోగించును. “ఇ”కారమునకు ‘ఇప్పుడు’ అని అర్థము. “షి” యనగా ఇప్పటి దేవ సంబంధమైన సుస్థితి.
మనలో ఋషి భావము నిత్యముగ ఒకమూల ఉన్నది. అది బయటకు వచ్చి – తరువాత ఏమి పని చేయవలెనన్న ప్రశ్నను పుట్టించినది బ్రహ్మమని మనలోనున్న ఋషిభావము తెలుపును.

5. ప్రదేశః

“ఉపదేశో” అని సాయణుడు. ప్రదేశము అనగా ఉపదేశము. ఆజ్ఞ మనలోనున్న ఋషిత్వము ప్రశ్నను పుట్టించినది బ్రహ్మమని చెప్పినదిగదా!
బ్రహ్మము ప్రశ్నను పుట్టించెనని మనలోనున్న ఋషిత్వము చెప్పినది సరే. ఆ ఋషిత్వమును ఆ పని చేయుమని – అట్లు చెప్పవలసినదనినది ఏది? ఉపదేశించినది ఏది?

6. భవతి

సాయణుడు “భవతి”‍శబ్దమునకు అర్థము వ్రాయలేదు. అందరెరిగినదిగదా అని వదలివేసినాడు.
ఆ ఉపదేశించినది – “భవతి” – ఎల్లవేళల, అన్ని చోటులయందు నిత్యమై, సనాతనమై, నీయందును, నాయందును, సకల జగములందును, హిరణ్యకశిపుడు కృద్ధుడై తన్నిన స్తంభమునందున్న సనాతనమూర్తియైన బ్రహ్మము.
కనుక యీ సకల ప్రశ్నలు, తదర్థములు, తద్గ్రాహ్యములు, తత్కర్మలు, తత్కారణములు, తత్కర్తలు, తత్కార్యములు, తత్ఫలితానుభవ సంబంధితమైన పునర్జన్మలు, పునరూహలు, తద్యత్నములు, తపస్సులు, తదనంతర బ్రహ్మైకములు – సర్వమును ఆ బ్రహ్మముయొక్క వ్యవహారము – బ్రాహ్మణము.

ఇప్పుడు మనకు బ్రాహ్మణము అనగా తెలిసినది!

ఆర్షేయ బ్రాహ్మణము – నాలుగు శబ్దములతోనున్న ఒక్క మన్త్రముతోడ సృష్టి స్వరూపమును, మనలను, బ్రహ్మమును సకలము తెలియపరచినది.
ఆహా! వేదమనగ బ్రాహ్మణమనగ ఇప్పుడు తెలిసినది!
ఆ వేదము అవతరించినదనుటలో సందేహమేమున్నది!
అవతరించిన వేదవాక్యమునకు నమస్కరించి సాక్షాద్బ్రహ్మంబైన వేదాక్షరమునకు ప్రణమిల్లి, ఆర్షేయ బ్రాహ్మణ ప్రప్రథమ మన్త్రవ్యాఖ్యానమును ముగింతము.

3.3. ఆరణ్యకము

బ్రాహ్మణము చెప్పిన బ్రహ్మము మనస్సునందు ద్యోతమానమైన దానిని జ్ఞానభాగమునకు కొనిపోవు యత్న విధానము.

3.4.ఉపనిషత్తు

ఆ బ్రహ్మజ్ఞానము మన జ్ఞానభాగము సేయు విధానము

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: